క్యాబినెట్ ఆమోదం తెలిపిన నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు ముఖ్యంగా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది రైతుకు సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.6200 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ఈ సీజన్లో 4.6 లక్షల రైతుల నుంచి 28.83 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. మిగిలిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సుంకంలో టారిఫ్ల తగ్గింపును మార్చి వరకు పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీనివల్ల రూ.300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని వెల్లడించారు. ఫెర్రో అలాయిస్ పరిశ్రమలో కార్మికుల కోసం ప్రభుత్వం భారం భరిస్తుందన్నారు.
అలాగే 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడలో రూ.294 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని వెల్లడించారు. వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో 2 కారిడార్లకు భూమి బదిలీ కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే వైఎస్ఆర్ జిల్లాలో 2,590 ఎకరాలు ఏపీఐఐసీకి బదిలీకి ఆమోదం తెలిపిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2600 ఎకరాలు ఏపీఐఐసీకి బదిలీకి ఆమోదం లభించిందన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల దాఖలు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు ఉంటుందని వెల్లడించారు. అలాగే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు