జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
విజయనగరం, జనవరి 03 ః ఈ నెల 6వ తేదీ నుంచి మెడికల్ పెన్షన్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ ప్రక్రియపై జిల్లా అధికారులు, ఎంపిడిఓలు, వైద్యాధికారులతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలోని వైద్య పింఛన్లలో పూర్తిగా మంచానికే పరిమితమై పింఛన్ పొందుతున్నవారు 342 మంది ఉన్నారని, తొలివిడతలో వీరి పింఛన్లను రీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. తరువాత దశలో మిగిలిన వైద్య పింఛన్లను పరిశీలిస్తారని చెప్పారు. రీ వెరిఫికేషన్‌కు ఇతర జిల్లాలనుంచి 6 బృందాలు వస్తాయని చెప్పారు. ఒక్కో బృందంలో ఒక ఆర్ధోపెడిక్ డాక్టర్, ఒక జనరల్ మెడిసన్ స్పెషలిస్ట్, వైద్యాధికారితోపాటు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని తెలిపారు. వీరంతా ఆయా రోగులను, వారి మెడికల్ సర్టిఫికేట్, సదరం, ఆధార్ తదితర దృవపత్రాలను పరిశీలన చేసి, వారి వివరాలను యాప్‌లో నమోదు చేస్తారని చెప్పారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ బృందాలు పర్యటిస్తాయని, మూడు రోజుల విరామం తీసుకుంటాయని చెప్పారు. వీరి తనిఖీలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగకు ముందే వీలైనంత ఎక్కువమందిని తనిఖీ చేసేటట్లుగా చూడాలని సూచించారు. పింఛన్‌దారుల అర్హతలను, దృవపత్రాలను పరిశీలించడానికి మాత్రమే ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపడుతోందని, అర్హుల పింఛన్లు తొలగించే ఉద్దేశ్యం ఎంతమాత్రం ప్రభుత్వానికి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి డిఆర్డిఓ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, జెడ్పి సిఈఓ బివి సత్యనారాయణ, ఇపిఓ టి.వెంకటేశ్వర్రావు, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, జిజిహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, డిటిసి డాక్టర్ కె.రాణి, ఆర్బిఎస్కె డి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.