తక్షణమే వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, రేపటినుంచే పారిశుధ్య పనులను నిర్వహించాలని నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. లబ్దిదారులతో సమావేశం నిర్వహించి పిఎం సూర్యఘర్ పథకం క్రింద ఇళ్లకు సోలార్ విద్యుత్ కనక్షన్ పెట్టుకొనేవిధంగా చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ అదితి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, టిడ్కో కాలనీల్లో వీలైనంత తర్వగా కనీస సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. లబ్దిదారులు నివాసం ఉండేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సమీపంలో నిర్మించిన సబ్ స్టేషన్‌ను శుక్రవారమే ప్రారంభిస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్దిదారులు ఇళ్లలోకి రాకుండా వేచి చూస్తున్నారని, సదుపాయాలను కల్పించిన వెంటనే వారందరినీ ఇళ్లలోకి రప్పిస్తామని చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్దిదారుల జాబితాలను కూడా మార్చేశారని, జాబితాలను తనిఖీ చేసి, వారికి న్యాయం జరిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. పేర్లను తొలగించిన లబ్దిదారులు అప్పట్లో తమకు ప్రభుత్వం అందజేసిన మంజూరు పత్రాలను తీసుకొని తమను సంప్రదించాలని అదితి కోరారు.
ఈ పర్యటనలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పాలవలస యశశ్వి, ఎపిఈపిడిసిఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, మెప్మా పిడి సత్తిరాజు, టిడ్కో ఇఇ డివి రమణమూర్తి, విజయనగరం, నెల్లిమర్ల తాసిల్దార్లు కూర్మనాధరావు, సుదర్సన్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, ఇతర అధికారులు, టిడిపి నాయకులు ఐవిపి రాజు, బొద్దుల నర్సింగరావు, అవనాపు విజయ్, కర్రోతు నర్సింగరావు, అనురాధ, బిజెపి నాయకులు ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు.