ఎస్.కోట, వేపాడ, (విజయనగరం), జనవరి 17 :ఉగాది నాటికి రహదారులు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పలు గిరిజన గ్రామాల ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హామీ ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలిసి ఆయన శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. గిరిజనులతో గ్రామ సభలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు.
ఎస్ కోట మండలం పుణ్యగిరి వద్ద రేగ పుణ్యగిరి గ్రామస్తులతో ముందుగా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. పుణ్యగిరి గ్రామం నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి రహదారి సౌకర్యం లేదని దీనివలన చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్ కు తెలియజేశారు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే శరణ్యమని వాపోయారు. అలాగే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పోడు పట్టాలు ఇప్పించాలని, త్రాగునీటి పథకం, ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ, రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద రహదారిని నిర్మించాలని గ్రామసభ తీర్మానించడంతో, అప్పటికప్పుడే కలెక్టర్ ఆమోదం తెలిపి, వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. అదేవిధంగా జలజీవన్ మిషన్ కింద మంజూరైన రూ.48.40 లక్షల ఖర్చుతో వెంటనే త్రాగునీటి పథకం పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ రెండింటిని ఉగాది నాటికకి పూర్తచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారు. గ్రామంలోని గర్భిణులకు కాన్పునకు కనీసం వారం రోజుల ముందే ఆసుపత్రికి తరలించాలని వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. వారు రాని పక్షంలో ఆ జాబితాను తహసీల్దార్ కు అందజేయాలని చెప్పారు. 42 కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములపై సర్వే నిర్వహించి, అర్హత ఉన్నవారికి పోడు పట్టాలు మంజూరు చేయాలని, భూములు ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల జాబితాలను సిద్దంచేసి, మార్చి తరువాత వచ్చే కొత్త గృహ నిర్మాణ పథకం కింద వారికి ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. రేగ పుణ్యగిరితో బాటు పుణ్యగిరి గ్రామస్తుల నుంచి కూడా వినతులను స్వీకరించి, సమస్యలు పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు.
ప్రత్యేకాధికారి పిఎన్వి లక్ష్మీనారాయణ, హౌసింగ్ ఈఈ మురళీ, వేపాడ జెడ్పీటీసీ ఎస్.అప్పారావు, ఎంపిపి డి.సత్యవంతుడు, ఎపిడిఓ సిహెచ్ సూర్యనారాయణ, ఆయా మండలాల తాసిల్దార్లు అరుణకుమారి, రాములమ్మ, ఇతర అధిఆరులు, సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.