విజయనగరం, జనవరి 08 ఃపల్లె పండుగలో భాగంగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులు 296 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రోడ్ల మరమ్మతు పనులపై రహదారులు భవనాల శాఖ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ తమ ఛాంబర్లో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 884 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 176 పనులను ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. వీటిలో మొదటి విడత 296 కిలోమీటర్ల మేర సుమారు రూ.10.54 కోట్ల ఖర్చుతో చేపట్టిన 68 పనులు గురువారం నాటికి పూర్తి అవుతాయిని చెప్పారు. ఇవన్నీ అనుకున్న లక్ష్యం మేరకు సంక్రాంతి పండుగ నాటికి సిద్దమయ్యాయని తెలిపారు. రెండో విడత క్రింద రూ.13కోట్లతో 588 కిలోమీటర్ల మరమ్మతు కోసం 108 పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 106 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ కాంతిమతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.