విజయనగరం, డిసెంబరు 24 ః ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగదారుడేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో, జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన జెసి సేతు మాధవన్ మాట్లాడుతూ, వినియోగదారుడే రాజు అని స్పష్టం చేశారు. వారు కొనుగోలు చేసే వస్తు, సేవలకు పూర్తిగా సంతృప్తి చెందాల్సి ఉందన్నారు. అలా సంతృప్తి చెందకపోతే, న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. విక్రయించే వస్తువు గురించి పూర్తి సమాచారాన్ని అందజేయాల్సిన బాధ్యత తయారీదారుడిపై ఉందని స్పష్టం చేశారు. కొనుగోలు చేసేముందు వాటిని వినియోగదారులు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. వస్తువు పరిమాణం, నాణ్యత, శుధ్దత, సామర్ధ్యం పరిశీలించాలని అన్నారు. తమ హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు 1986 నుంచీ ప్రతీఏటా వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు, న్యాయమూర్తి ఆర్.వెంకట నాగ సుందర్ మాట్లాడుతూ, వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. జిల్లా కమిషన్ పరిధిలో సుమారు రూ.50 లక్షలు వరకు విలువైన వ్యాజ్యాలను వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలోని వినియోగదారులు తమ న్యాయం స్థానం ద్వారా పరిహారాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, నిర్మాణం, రవాణా, గ్యాస్, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సేవా లోపాలపై తమ కమిషన్‌ను ఆశ్రయించవచ్చునని సూచించారు. 2019 వినియోగదారుల హక్కుల చట్టం వచ్చిన తరువాత, వినియోగదారుడు వస్తుసేవలను ఎక్కడ కొనుగోలు చేసినప్పటికీ, తాము నివాసం ఉన్న చోటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు కలిగిందని చెప్పారు. ఈ-డాఖిల్ వెబ్ సైట్ ద్వారా కూడా కేసులు వేయవచ్చునని సూచించారు.
జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు బి.శ్రీదేవి మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులు, చట్టాలను వివరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ, వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విచారణ మరియు డిజిటల్ సౌలభ్యం ఇతివృత్తంగా ఈ ఏడాది వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రశాంత్‌కుమార్, ఐఓసి సేల్స్ ఆఫీసర్ యోగేష్‌కుమార్, జిల్లా ఔషద నియంత్రణశాఖ ఎడి రజిత, జిల్లా ఆహార భద్రతాధికారి వెంకటరమణ, సిడిపిఓ ప్రసన్న, తూనికలు కొలతల శాఖ డిసి దామోదరనాయుడు, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సురేష్, ఆశరా జాయింట్ సెక్రటరీ ఎం.చంద్రశేఖర్, డిసిఐసి జిల్లా కార్యదర్శి ఎస్.కామేశ్వర్రావు మాట్లాడుతూ తమ శాఖలు, సంస్థల పరంగా వినియోగదారుల హక్కులు, సేవల గురించి వివరించారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మేలుకొలుపు మాస పత్రికను ఆవిష్కరించారు. వినియోగదారులకు అవగాహన కల్పిచేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.