తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానం అనేది చాలా ఎక్కువ.. పాతతరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఆ తర్వాతి తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ,నాగార్జున నేటితరం అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ జూనియర్, ఎన్టీఆర్ ఇంకా మరి కొంతమంది హీరోలకు అభిమాన సంఘాలు కలిగి ఉంటాయి.
మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అది ఏ స్థాయిలో అనేది అర్థరాత్రి 12 గంటలకు బెనిఫిట్ షోలు వేసే థియేటర్స్ వద్దే చూడాలి. ఆకలి నిద్ర లెక్క చేయకుండా వెర్రి అభిమానంతో విర్రవీగుతూ సినిమా హాలు వద్ద పడిగాపులు కాస్తారు,తన ప్రాణాలని కుటుంబాలని కూడా లెక్కచేయకుండా ఈనాటి యువత పిచ్చి సినీ అభిమాన మోజులో పడి వాళ్ళ జీవితాన్నే పనంగా పెడుతున్నారు. ఈ సంస్కృతి గత దశాబ్ద కాలంగా సాగుతూనే ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా మోజులో సినీ వ్యామోహం మరీ పరాకాష్టకు చేరుకుంది. ఈవెంట్లు యూట్యూబ్లో రివ్యూలు ప్రమోషన్ల పేరుతో అంచనాలు పెంచి ధియేటర్లకు రప్పించడం విష సంస్కృతిగా మారింది. దానికి ప్రధాన కారణం పైరసీ భూతం ..సినిమా ఇండస్ట్రీకి పైరసీ భూతం వెంటడం మెదలైనప్పటి నుండే ఈ సంస్కృతి మెదలైంది. కేవలం ఒక వారం రోజుల్లో సినిమా పై పెట్టిన పెట్టుబడి వచ్చేలా ప్రమోషన్ చేయడం టిక్కెట్టు రేట్లు పెంచడం అంచనాలను పెంచుతూ అభిమానులు వెర్రి తనంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. నేటి యువతరం వారి కుటుంబం తల్లిదండ్రులు , భవిష్యత్తు కోసం ఆలోచన లేకుండా ఎంత రద్దీ ఉన్నా టిక్కెట్టు కోసం తొక్కిసలాటలో బలికావడం లాంటి సంఘటనలు చేటు చేసుకుంటున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి అనే మహిళ తన కొడుకు తో సహా బెనిఫిట్ షో కి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం.. అంత జన సందోహంలో ఒక మధ్యతరగతి మహిళ అంత సాహసం చేయడం అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సినిమా ఇవాళ కాకపోతే రేపు చూడవచ్చు భవిష్యత్తు చూసే పిల్లలతో అంత జన సందోహంలో వెళ్లి సినిమా చూడాల్సినంత అత్యవసరం ఏంటి.? సగటు మనిషిగా ఆలోచించాలి. జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడు అనడం కూడా సబబు కాదు ప్రేక్షకుల ప్రాణాలు పోవాలని ఏ హీరో కూడా కోరుకోడు ఎవరి వ్యక్తిగత భద్రతపై వారు తగు జాగ్రత్తలు పాటించాలి. పోలీస్ అధికారులు కూడా ఒక అంచనా వేయలేని పరిస్థితిని ప్రేక్షకులు తీసుకురావడం ఇలాంటి సంఘటనలకు నిదర్శనం సందిట్లో సడేమియా అన్నట్లు ఈమధ్య ప్రభుత్వాలు కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా దానికి రాజకీయ రంగు పులిమేడం అలవాటుగా మారింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కూడా పక్కా రాజకీయంగానే కనబడుతుంది. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంది. కానీ రాజకీయ కోణంలో దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయకూడదు అది ప్రభుత్వానికి, ప్రజలకి మంచిది కాదు. సినిమా ఇండస్ట్రీ వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందారు. రాష్ట్రం విడిపోయాక ఇండస్ట్రీపై వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ ప్రభుత్వానికే వెళుతుంది. హైదరాబాదు నగరం లో వచ్చే ఆదాయంలో సినిమా ఇండస్ట్రీ ఆదాయం అనేది చాలా కీలకం అన్నది అందరికి తెలిసిందే.. అంకెల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం రాజకీయ కోణంలో వెళుతోందనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీని కొరకై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి విలేఖర్లతో మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లే ప్రమాదం వస్తుందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రహించారని స్పష్టం అవుతుంది. సంధ్యా థియేటర్ సంఘటన విషయంలో అందరూ ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఆలోచిస్తున్న చర్చ జరుగుతోంది. ఫిలిం ఇండస్ట్రీలో రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తులుగా బాలకృష్ణ , చిరంజీవి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే రాజకీయ కోణమే కనపడుతుంది. ఈ సంఘటన ద్వారా అగ్ర హీరోలే కాదు వారి అభిమానులు తల్లిదండ్రులు గుణపాఠాలు నేర్చుకోవాలి. రేపటి రోజున సినిమా చూడొచ్చు కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదన్నది వాస్తవం మన జీవితం మన చేతిలోనే ఉంటుంది తస్మాత్ జాగ్రత్త..! జర్నలిస్ట్ సురేష్ రాజు..🙏