విజయనగరం, డిసెంబర్ 15: పొట్టి శ్రీరాములు చిర స్మరనీయులని, వారి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ను ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, ఎం.పి కలిశెట్టి అప్పల నాయుడు తదితరులు జ్యోతి ప్రకాశనం గావించి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా రాష్ట్రమంతటా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేసారని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి మనకు ప్రత్యేక గుర్తింపును తేవడానికి ప్రాణ త్యాగం చేసిన దేశభక్తుడని పేర్కొన్నారు. వారి ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని, ప్రతి విద్యార్థి వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ మరణించి కూడా అమరజీవిగా నిలిచిపోయారంటే ఆయన త్యాగం గొప్పదనం తెలుస్తుందని అన్నారు. ఆయన దీక్ష, పట్టుదల ఉన్న వ్యక్తి అని, ప్రతి ఒక్కరూ ఆయన మార్గం లో నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు.
పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ సమాజం తర్వాతే మనం అని ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, ఆంధ్రులను తలెత్తుకొని తిరిగేలా చేసిన గొప్ప దేశ భక్తుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, బిసి సంక్షేమ అధికారి పెంటోజీ రావు, డి.ఈ.ఓ మాణిక్యం నాయుడు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డి.పి.ఓ వెంకటేశ్వర రావు, హోసింగ్ పిడి కూర్మినాయుడు, పలు శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.