ఈ నెల 6 నుంచీ జనవరి 8 వరకు 33 రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సదస్సుల్లో అందించే సేలన్నీ పూర్తి ఉచితమని, ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారంతో సదస్సులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ మాట్లాడుతూ, సదస్సుల షెడ్యూల్ను, నిర్వహించే విధానాన్ని వివరించారు. సదస్సుల్లో స్వీకరించిన ప్రతీ అర్జీకి రసీదు ఇవ్వాలని, అవకాశం ఉన్నవాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ప్రతీ అర్జీని ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆ తరువాత 45 రోజుల్లో గా వాటిని పరిష్కరించాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సులకు అత్యంత ప్రాధాన్యత నిస్తొందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చే విధంగా, అర్జీ దారులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా వాటిని పరిష్కరించాలని కోరారు. సదస్సుకు తాసిల్దార్, డిప్యుటీ తాసిల్దార్, ఆర్ఐ, సర్వేయర్తోపాటు, అటవీ, వక్ఫ్ బోర్డు, దేవాదాయ, రిజిష్ట్రేషన్ శాఖల అధికారులు కూడా తప్పనిసరిగా పూర్తి రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయాలని, పెద్ద గ్రామాల్లో సాయంత్రం వరకు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 502 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయ్యిందని, ఆ గ్రామాల్లో రీసర్వే సమస్యలపై సుమారు 24,560 దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. వీటిలో 10,500 దరఖాస్తులు రీసర్వేకు సంబంధించినవి కాగా, 13,200 వరకు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయని చెప్పారు. ఈ సదస్సుల్లో వినతులు ఇచ్చిన వారు మరోసారి రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆయా గ్రామాల్లో ముందుగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. మీడియా, సోషల్ మీడియాలను వినియోగించుకోవడం తోపాటు సెల్ఫోన్లకు మెసేజ్లు పంపించడం, టాంటాం వేయడం లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామంలో విస్తృత ప్రచారం జరగాలన్నారు. సదస్సులను నిర్వహణకు రెండు రోజుల ముందే ఆయా గ్రామ పటాన్ని పూర్తిగా భూముల వివరాలతో గ్రామంలో ప్రదర్శనకు ఉంచాలని చెప్పారు. సదస్సును ప్రారంభించే ముందు అధికారులంతా ముందుగా గ్రామంలో పర్యటించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణను మండల ప్రత్యేకాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.
నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి మాట్లాడుతూ, పేద ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సులకు శ్రీకారం చుడుతోందని అన్నారు. తమకు వచ్చే సమస్యల్లో సుమారు 60 శాతం వరకు రెవెన్యూకు సంబంధించినవేనని చెప్పారు. పేద ప్రజలకు అన్యాయం జరగకుండా, వారి భూములకు రక్షణ కల్పించే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. భూముల విలువ అమాంతంగా పెరిగిపోవడంతో, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సైతం గ్రామాల్లో ఎక్కడా స్థలం దొరకడం లేదని చెప్పారు. ఎటువంటి వత్తిళ్లకు లోనుకాకుండా, పేదలకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఎపి మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ భూసేకరణలో పలు అవకతవకలు జరిగాయని చెప్పారు. సుమారు 152 మంది అసలు హక్కుదారులకు నేటికీ పరిహారం అందలేదని, వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రజా సంఘాల నాయకులు రాంబాబు, తుమ్మి అప్పలరాజుదొర, జి.శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ పరమైన సమస్యలను ప్రస్తావించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, మండల ప్రత్యేకాధికారులు, ఎస్డిసిలు, ఆర్డిఓలు, తాసిల్దార్లు, ఎన్జీఓలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.